శ్రీరామ నవమి: ధర్మం విరిసిన వసంతం! 🚩🚩

 శ్రీరామ నవమి: ధర్మం విరిసిన వసంతం! 

వసంత రుతువులో, ప్రకృతి పులకరించే వేళ.. లోకాభిరాముడు, దశరథ నందనుడు ఈ భూమిపై అడుగుపెట్టిన పరమ పవిత్ర దినం. కేవలం ఒక దేవుడి పుట్టినరోజుగానే కాకుండా, ఒక 'మనిషి' ఎలా జీవించాలో నేర్పిన మర్యాదా పురుషోత్తముడి పర్వదినం ఇది.

రామావతార విశిష్టత: కాలం చెప్పిన సాక్ష్యం

పురాణాల ప్రకారం, త్రేతాయుగంలో... చైత్ర శుద్ధ నవమి నాడు, గురువారము (బృహస్పతి వారము), పునర్వసు నక్షత్రాన కర్కాటక లగ్నంలో... సరిగ్గా సూర్యుడు నెత్తిమీదకు వచ్చే అభిజిత్ ముహూర్తంలో (మధ్యాహ్మం 12 గంటలకు) శ్రీరాముడు జన్మించాడు. ఆ మహనీయుడు జన్మించిన ఆ క్షణం, లోకానికి ఒక కొత్త ఆశను, ధర్మానికి ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. అందుకే ఆ రోజే మనకు పండుగ రోజు.

ఒకే రోజు - రెండు శుభ తరుణాలు

చైత్ర శుద్ధ నవమికి మరో గొప్ప విశేషం కూడా ఉంది. పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత, శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ పరిణామం కూడా ఇదే చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని భక్తుల గాఢ విశ్వాసం. అంటే, ఇది రాముడి జన్మదినమే కాదు, రామరాజ్య స్థాపన దినం కూడా!


త్రేతాయుగపు చైత్ర నవమి నాడు.. ఉదయించిన ధర్మం!

నవవసంతాన .. నరజాతికి చూపిన నీతి మార్గం!

తండ్రి మాటకై త్యాగం చేసిన రాజ్య సుఖం..

అడవి బాటలో వెతికిన ఆదర్శ పథం!

ధర్మానికి నిలువెత్తు రూపం నీవయ్యా..

మా ఇలవేల్పు ఈ కోదండ రామయ్య!

ఊరు వాడ లో ప్రకృతి-పురుషుల కల్యాణం..

చూడగ తరించును భక్త కోటి ప్రాణం!

వడపప్పు పానకాల తీపి విందుతో.. 

రామనామ స్మరణల భక్తి నివాళితో..

జరుపుకుందాం రండి ఈ 'లోక కల్యాణం!

లోక కల్యాణ కారకం- సీతారామ కల్యాణం.

రామాయణ పరమార్థం ప్రకారం, రాముడు ధర్మానికి నిలువెత్తు రూపం (రామో విగ్రహవాన్‌ ధర్మః). సీతాదేవి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఈ ఇద్దరి కలయిక కేవలం ఒక వివాహం కాదు, అది ప్రకృతి పురుషుల అపూర్వ కలయిక. రావణ సంహారం వంటి లోక కల్యాణ కార్యాలు జరగటానికి సీతారాముల వివాహమే ప్రధాన కారణం.

అందుకే ఈ కల్యాణం చూడటం వల్ల లోకంలోని అశాంతి నశించి, సుభిక్షం కలుగుతుందని నమ్మకం. ఈ కారణంతోనే సీతారాముల కల్యాణాన్ని ‘లోక కల్యాణ కారకం’ అంటారు. శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణాన్ని వీక్షించడం, రామనామాన్ని స్మరించడం ప్రతి హిందువుకు పరమ పవిత్రమైన విధి.


రాముడు నడిచిన దారి - ధర్మం. రాముడు పలికిన మాట - సత్యం. ఈ శ్రీరామనవమి వేళ, మన హృదయాల్లో కూడా ఆ రామయ్య లాంటి సహనం, ధైర్యం, ధర్మనిరతి కలగాలని, లోకమంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుందాం.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!🚩🚩


Comments

  1. Chala bagundi.
    Baaga vraasaru

    ReplyDelete
  2. Chalaa baaga varninchaaru
    Prakruthi,purushula kalyaanam antu kanuvindu chesaaru

    ReplyDelete
  3. చాలా బాగుంది. ప్రకృతి,పురుషుడు..కళ్యాణం చాలా ఫ్రెష్ గా ఉంది

    ReplyDelete
  4. చాలా బాగా చెప్పారు

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

"Journey of a Storyteller: From Stage Plays to Screen Plays | Tarakraam.K

వదలని ఆలోచన: ఒక రచయిత 15 ఏళ్ల అంతర్మథనం